ఎనిమిది మున్సిపాలిటీల్లో ఏకగ్రీవాలపై ఉత్కంఠ…పులివెందుల, కడప కార్పొరేషన్‌పై టీడీపీ, వైసీపీ గురి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దాదాపు ఎనిమిది మున్సిపాలిటీలు ఏకగ్రీవం కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాపై, ముఖ్యంగా పులివెందులపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కడప కార్పొరేషన్, పులివెందుల మున్సిపాలిటీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.కడప జిల్లా కేంద్రంగా మున్సిపల్ ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి పురపాలక సంఘాలతో పాటు గురజాల, కమలాపురం నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియ తుది ఫలితం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం స్పష్టమవుతుంది.పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. ఇక్కడ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ సుమారు పది వార్డులను ఏకగ్రీవంగా దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీలో వైసీపీ తరఫున మొత్తం 30 నామినేషన్లు దాఖలు కాగా, టీడీపీ తరఫున 69 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు కమలాపురంలో 23 వార్డులు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి చైర్‌పర్సన్ పదవికి గానీ, వార్డులకు గానీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.మైదుకూరు మున్సిపాలిటీలో వైసీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఈ పదవి కూడా టీడీపీకి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎర్రగుంట్ల చైర్‌పర్సన్ పదవిని బీజేపీకి కేటాయించారు. ఇక్కడ తొలిరోజు వైసీపీ తరఫున ఒక వార్డుకు మాత్రమే నామినేషన్ దాఖలైంది. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి మరెవరూ నామినేషన్లు వేయకపోవడంతో చైర్‌పర్సన్ పదవి బీజేపీకి ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.అయితే, పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవితో పాటు కడప కార్పొరేషన్ పదవుల కోసం వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరి నామినేషన్ల పరిశీలన ఈ రోజున జరగనుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈసారి మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఈ రెండు పదవులపైనా వైసీపీ ఆశలు పెట్టుకుంది. తాజా రాజకీయ సమీకరణాలు, పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు పదవులను దక్కించుకునేందుకు టీడీపీ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది.ఈ నెల 21న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు రానుండటంతో జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. పులివెందుల మున్సిపాలిటీ, కడప కార్పొరేషన్‌లో జరిగే పోలింగ్‌తో పాటు తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ రెండు కీలక స్థానాల్లో పోటీపై స్పష్టత రానుంది.
