మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వ్యూహంతో మారిన రాజకీయ సమీకరణాలు…. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చ

రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా రాయలసీమలో పుంగనూరుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారంలో ఉన్నా, లేకపోయినా పుంగనూరులో తన పట్టును కొనసాగిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు తొలిసారిగా అదే పుంగనూరులో వెనుకడుగు వేశారు. చంద్రబాబుతో రాజకీయంగా తలపడుతూ వచ్చిన పెద్దిరెడ్డి.. ప్రస్తుతం ఆయన మంత్రివర్గ సహచరుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వ్యూహాలకు తట్టుకోలేక వెనక్కి తగ్గారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. దీంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరకు కొన్ని చోట్ల నామినేషన్లు వేశారు. అయితే అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో మాత్రం వైఎస్సార్‌సీపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పెద్దిరెడ్డి ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్దిరెడ్డి అడ్డాగా భావించే పుంగనూరులో, అదీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బరిలోకి దిగకపోవడం రాయలసీమ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామం వెనుక జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పాత్ర కీలకమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, ఎంపీ మిథున్‌రెడ్డి తన అనుచరులతో కలిసి నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేలా అల్లర్లు సృష్టించారని కథనంలో పేర్కొన్నారు. మిథున్‌రెడ్డి కారులో కూర్చొని టీడీపీ శ్రేణుల వైపు వాహనాన్ని నడిపించారని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని రంగంలోకి దించినట్లు సమాచారం. పుంగనూరుకు వెళ్లిన మంత్రి అక్కడే ఉండి పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల ప్రక్రియలో ధైర్యంగా ముందుకు సాగాలని భరోసా ఇచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయని, ఈ పరిణామం కీలక మలుపుగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం ద్వారా బీసీ జనార్దన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.తాజా పరిణామాల నేపథ్యంలో 24 గంటల్లోనే పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డి ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కథనం పేర్కొంది. అయితే ఈ నిర్ణయం వెనుక కార్యకర్తల సమన్వయం మాత్రమే కాకుండా, పుంగనూరులో పార్టీని బలోపేతం చేయాలన్న బీసీ జనార్దన్‌రెడ్డి దీర్ఘకాలిక వ్యూహం కూడా పనిచేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఆయన నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని, పనుల విషయంలో రాజీపడకుండా నిధులు కేటాయించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణులకు సరైన సమయంలో అండగా నిలవడం, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించడం, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనేలా కార్యకర్తల్లో ధైర్యం నింపడం వంటి అంశాలు ఆయనకు కలిసివచ్చాయని విశ్లేషిస్తున్నారు.ఈ పరిణామాలన్నీ కలిసి పెద్దిరెడ్డి వంటి సీనియర్ నాయకుడు వెనక్కి తగ్గే పరిస్థితిని కల్పించాయని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పుంగనూరులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో నియోజకవర్గ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతాయనే చర్చ సాగుతోంది. పుంగనూరులో టీడీపీ బలం పెరుగుతుందా, ఈ పరిణామాలు వైఎస్సార్‌సీపీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
